ఉసిరితో షుగర్‌ కంట్రోల్‌.. తినడానికి ముందు ఇలా చేస్తే చాలు..!

  • భోజనానికి ముందు తింటే షుగర్‌ స్పైక్స్‌ తగ్గే అవకాశం
  • ఇన్సులిన్‌ సెన్సిటివిటీని మెరుగుపరిచే గుణాలు
  • ఉసిరిలో సమృద్ధిగా విటమిన్‌-సి, యాంటీఆక్సిడెంట్లు 
  • రోజూ 1-2 తాజా ఉసిరికాయలు తీసుకోవాలని సూచన
మధుమేహంతో బాధపడుతున్న వారికి ఉసిరికాయ సహజ ఔషధంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. భోజనానికి ముందు ఒకటి లేదా రెండు తాజా ఉసిరికాయలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రించవచ్చని పలు అధ్యయనాలు వెల్లడించాయి. భారత్‌లో సుమారు తొమ్మిది కోట్ల మందికిపైగా డయాబెటిస్‌తో బాధపడుతున్న నేపథ్యంలో ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు కూడా ప్రయోజనకరంగా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.

ఉసిరిలో విటమిన్‌-సి, పాలీఫెనాల్స్‌, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో గ్లూకోజ్‌ మెటబాలిజాన్ని మెరుగుపరచడమే కాకుండా ఇన్సులిన్‌ ప్రభావాన్ని పెంచుతాయి. భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు వేగంగా పెరగకుండా అడ్డుకుంటాయి. దీంతో క్లోమగ్రంథిపై ఒత్తిడి తగ్గి శరీరం చక్కెరను సమర్థంగా వినియోగించుకోగలుగుతుంది.

‘డయాబెటిస్‌ అండ్‌ మెటబాలిక్‌ సిండ్రోమ్‌’ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం భోజనానికి ముందు ఉసిరి తింటే ‘ప్రీలోడింగ్‌ ఫుడ్‌’ విధానంలా పనిచేసి రక్తంలో గ్లూకోజ్‌ హెచ్చుతగ్గులను తగ్గిస్తుంది. అయితే ఉసిరిని మందులకు ప్రత్యామ్నాయంగా భావించొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తాజా ఉసిరికాయను నేరుగా తినడం అత్యంత ప్రయోజనకరమని చెబుతున్నారు. చక్కెర కలపని ఉసిరి రసం లేదా నీటిలో కలిపిన ఉసిరి పొడిని కూడా పరిమిత మోతాదులో తీసుకోవచ్చు. అయితే మధుమేహ మందులు వాడుతున్నవారు, ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాతోనే ఉసిరిని ఆహారంలో చేర్చుకోవడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Amla
Diabetes control
Blood sugar levels
Indian Gooseberry benefits
Natural diabetes remedies
Glucose metabolism

More Telugu News